
◽ దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
◽ తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో మాట్లాడుతూ, దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్ తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్‌లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు.
🔴 అదనపు ఈవో మాట్లాడుతూ:
– సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.- ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని రెండు లడ్డూలు పొందవచ్చు.
– ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చు.
– అయితే దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలోవలే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు.
– టోకెన్స్ లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూ తో పాటు 4-6లడ్డూలను కొనుక్కోవచ్చు.
– గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరల విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది. – దీనిని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్ పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
– కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తోంది.