
టీడీపీలోకి గల్లా రీ ఎంట్రీ :
కొన్ని నిర్ణయాలకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. గుంటూరు మాజీ ఎంపీ, అమర్ రాజా సంస్థల యజమాని గల్లా జయదేవ్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆవేశంలో గత ఎన్నికల్లో రాజకీయాల నుంచి వైదొలిగిన ఆయన ఇప్పుడు టీడీపీ దశ తిరగడంతో తన భవిష్యత్తుకు తానే అడ్డుగోడ అయినట్లు బాధపడుతున్నారు. చేసేది లేక మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించకుండా ఉండే ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ఆయన కీ రోల్‌లో ఉండేవారు. చంద్రబాబు చెప్పినట్లు గుంటూరు ఎంపీగా మూడోసారి పోటీ చేస్తే కేంద్ర మంత్రి అయ్యేవారు. రామ్మోహన్‌నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో కీలక స్థానం రావడానికి జయదేవ్ పోటీలో లేకపోవడమే కారణం. జగన్ రాజకీయ ప్రత్యర్థులను వేటాడే క్రమంలో జయదేవ్‌ను టార్గెట్ చేశారు. అది తట్టుకోలేక ఎప్పుడూ ఇలాగే ఉంటుందనే భయంతో జయదేవ్ గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్డీయేకి గెలుపు అవకాశాలున్నాయని తెలిసినా ఒకవేళ మళ్లీ జగన్ వస్తే ఇబ్బంది పడతామనే ఉద్ధేశంతో పక్కకు తప్పుకున్నారు. జయదేవ్ కాదనడం వల్లే గుంటూరు ఎంపీ సీటును పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఇచ్చారు. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. ఇదంతా చూసి తాను ఎంత తప్పు చేశానో అని జయదేవ్ తెగ బాధపడుతున్నారు. అయిందేదో అయింది మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. త్వరలో ఆయన మళ్లీ టీడీపీలోకి పునఃప్రవేశించనున్నారు.
🔴 ఇదీ చంద్రబాబు ఆఫర్ : ఏపీలో ఎన్డీయే గెలుపు తర్వాత రాజకీయాల్లో లేకపోయినా తత్వం బోధపడి చంద్రబాబుకు దగ్గరగానే మసిలారు జయదేవ్. చంద్రబాబు ఢిల్లీలో వెళ్లినప్పుడల్లా జయదేవ్ నివాసంలోనే ఉండేవారు. జయదేవ్ పరిస్థితిని గమనించిన చంద్రబాబు మళ్లీ పార్టీలోకి రమ్మని సూచించారు. ప్రస్తుతానికి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని చెప్పినట్లు సమాచారం అందుతోంది. అయితే రాజకీయ కుటుంబానికి చెందిన గల్లా జయదేవ్‌కు తన సొంత ప్రాంతం చిత్తూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. రెండు సార్లు ఎంపీగా పని చేసిన గుంటూరులోనూ మంచి పలుకుబడి, పరపతి ఉన్నాయి. పార్టీలోనూ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ వద్ద గుర్తింపు ఉండటం వల్ల మళ్లీ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అయితే ఢిల్లీ పదవికి పరిమితమైతే గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోస్టు తీసుకోవాలా? వద్దా? అని తర్జనభర్జన పడుతున్నారు.
🔴 రాజ్యసభపై ఆశలు : రాజ్యసభకు వెళితే మళ్లీ కీ రోల్‌లోకి రావచ్చని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎన్డీయే కూటమి తరఫున రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబును కోరారు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళాలంటే అందుకు చాలా సమయం ఉంది కాబట్టి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండాలనే చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో జయదేవ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జయదేవ్ చంద్రబాబు నిర్ణయించినట్లు ఢిల్లీలో అధికార ప్రతినిధి అవుతారా? లేక జయదేవ్ ఆశిస్తున్నట్లు రాజ్యసభలో అడుగుపెడతారా? అన్నది చూడాల్సివుంది.