తెలంగాణా ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకు వెళ్లి, తెలంగాణాను పదేళ్ళ పాటు పాలించిన భారత రాష్ట్ర సమితి ఇక కాల గర్భంలో కలిసిపోయే సూచనలు కనపడుతున్నాయి అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొన్న కేసీఆర్… తన కొడుకు భవిష్యత్తు కోసం, కూతురు బెయిల్ కోసం బిజెపి తో రాజీ పడుతున్నారని తెలుస్తోంది. ఆర్ టీవీ కథనం తర్వాత తెలంగాణా రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతున్న కేసీఆర్ కు అది మినహా మరో మార్గం లేదని అంటున్నారు.
ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి పరిస్థితి చాలా దారుణంగా మారింది బీఆర్ఎస్ కు. ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోయే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆయన ఆందోళనగా ఉన్నారు. అటు కవిత కు బెయిల్ రాకపోతే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బిజెపి తో రాజీ పడకపోతే మాత్రం కచ్చితంగా కేసీఆర్ ను కూడా అరెస్ట్ చేయవచ్చు. అందుకే కేసీఆర్ ఇప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు. పార్టీని విలీనం చేస్తాను అని బిజెపికి చెప్పినట్టుగా ఆర్ టీవీ పేర్కొంది.
ఢిల్లీ ఎన్నికలకు ముందే ఈ విలీనం జరగాలని భావిస్తోంది. కారణం కవిత అప్రూవర్ గా మారి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ దోషిగా తెలిస్తే తమకు ఢిల్లీ లో రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని బిజెపి భావిస్తోంది. అందుకే కేసీఆర్ కు రాజ్యసభ పదవి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా కేటిఆర్ ను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే విలీన ప్రక్రియ మొదలయ్యే సూచనలు కనపడుతున్నాయి. కవితకు వచ్చే నెల బెయిల్ వచ్చే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేసారని అంటున్నారు.
