ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిని మళ్ళీ తిరిగి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. అమరావతిలో పనులను పూర్తి స్థాయిలో మొదలుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమస్య కూడా దాదాపుగా తొలగినట్టే కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలను అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం అమరావతిలో గతంలో నిర్మించిన భవనాల స్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ద్వారా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అమరావతిలో చెట్లను కూడా తొలగించే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు.
గత అయిదేళ్లుగా అసలు పనులను ఎక్కడా మొదలుపెట్టిన పరిస్థితి లేదు. దీనితో భారీగా చెట్లు పెరిగిపోయి పరిస్థితి దారుణంగా మారింది. దీనితో వాటిని తొలగించి కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణాలు, కొత్త భవనాలను నిర్మించాలనే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంచితే… ఇప్పుడు అమరావతిని జనసేన పార్టీ నేతలకు చూపించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అమరావతి పనులు ఎక్కడి వరకు గతంలో జరిగాయి, ఆ పనులు మొదలుపెడితే ఏం ఏం పూర్తి అయ్యే అవకాశం ఉంది వంటి అంశాలను ఆ పార్టీ నేతలకు వివరిస్తారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, సహా పలువురు కీలక నేతలు అందరికి అమరావతి మొత్తం తిప్పి చూపించే విధంగా పవన్ ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా వాస్తవాలను ప్రజలకు వివరించాలని పవన్ భావిస్తున్నారు. వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టడానికి ఈ పర్యటన జనసేన పార్టీ నేతలకు సహకరిస్తుందని పవన్ భావిస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ వద్దకు కూడా ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ తీసుకు వెళ్తారు. ఇక చంద్రబాబుతో కూడా అవసరమైతే ఈ రెండు విషయాల మీద ఎమ్మెల్యేలకు అర్ధమయ్యే విధంగా చెప్పించాలని పవన్ భావిస్తున్నారట.
